kalarchana 2019

A year to celebrate our Ancient Agricultural Civilization

కళార్చన మిషన్ గురించి(about)

1. కళార్చన మిషన్ యొక్క పరిచయం

1.1. కళార్చన మిషన్ అంటే ఏమిటి ?

కళార్చన మిషన్ అనేది అందరిని కలుపుకుపోయి చేసే ఒక జాతీయ సాంస్కృతిక కళాయజ్ఞం. “భారతీయం” ఉద్యమం స్పూర్తితో కళార్చన మిషన్ వివిధ సంస్థలను, నాయకులను మరియు  ప్రజలను ఈ క్రింది లక్ష్యాల సాధన కొరకు ప్రోత్సహిస్తుంది :

 • నవస్వరాజ్య నిర్మాణం కోసం 64+ కళలను ప్రదర్శనాస్త్రాలుగా వినియోగించటం.
 • సంప్రదాయ కళల పత్రికీకరణ, సంరక్షణ మరియు అభివృద్ధి (మూలాలను కాపాడుతూ)
 • 64+ కళలను ప్రోత్సహించేందుకు కళాపండుగల మరియు పోటీల నిర్వహణ
 • కళాకారుల జీవిత భద్రత, ఉన్నత జీవనసరళిని ఇవ్వగలిగే సామాజిక మార్పులు మరియు ప్రభుత్వ విధానాలు

1.2. కళార్చన మిషన్ ని నడిపిస్తున్న చోదక శక్తి : నవస్వరాజ్య స్థాపన 

మనకి తెల్లవాళ్ళ నుండి 70 సంవత్సరాల క్రితమే స్వరాజ్యం వచ్చింది. అయితే మనం అనుభవిస్తున్న ఈ  స్వరాజ్యం మన సమస్యలన్నిటినీ తీర్చగల్గిందా?  లేదు ! అందుకే మన స్వరాజ్యాన్ని పునర్నిర్మించుకుందాం.  నేటి తరం సమస్యలకు పరిష్కారాలు చూపిస్తూ భావి తరాలకు  మనం నిర్మించు కోవలసిన నవస్వరాజ్యం ‘సురాజ్యాన్ని’ మరియు ‘సుస్థిర ప్రగతిని’ సమతుల్యతతో తీసుకొని పోవాలి.

మన తరం చేసే తప్పులవల్ల భావితరాలకు ఎదురయ్యే సమస్యల గురించి, నేటి తరం తీసుకోవాల్సిన బాధ్యతల గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన లేదు. అందుకని నవ స్వరాజ్యాన్ని నిర్మించడానికి ముందు ప్రజలను చైతన్య పరచాలి.  ప్రజలను చైతన్యపరచడానికి కళల కంటే మంచి మాధ్యమం ఏముంటుంది? అందుకే కళార్చన మిషన్ సామాజిక మార్పుకోసం కళలను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటుంది. నవ స్వరాజ్య నిర్మాణానికి సంబంధించిన అంశాలు కళార్చన మిషన్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు పునాది అవుతాయి.

 

1.3. ఈ కళార్చన మిషన్ యొక్క కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నది ఎవరు ?

కళార్చన మిషన్ లక్ష్యాలు సాధించాలంటే ఎన్నో సంస్థల మధ్య, నాయకుల మధ్య , ప్రజల మధ్య బలమైన భాగస్వామ్యాలు  ఏర్పడాలి. భగీరధ యత్నమైన ఈ కార్యాన్ని సమన్వయం చేయడానికి ఒక సంస్థ కావాలి. అందుకని వాల్యూస్ ఫౌండేషన్ సమన్వయ బాధ్యతలైన వెబ్ సైట్, ఆఫీస్, ఉద్యోగులు, ఇంటర్నెట్ వగైరా బాధ్యతలు చేపట్టింది.

 

 

 

1.4. కళార్చన మిషన్ పరిణామక్రమం

నేపధ్యం:

2010 లో ఆగష్టు 15న భారతీయం ఉద్యమానికి పునాది పడింది. ఈ శాంతియుత ఉద్యమ లక్ష్యం “నవస్వరాజ్య నిర్మాణం” అని కొంతమంది కళాకారులు, విద్యార్ధులు మరియు సామాజిక కార్యకర్తలు తీర్మానం చేయడం జరిగింది. ఈ ఉద్యమ స్ఫూర్తి దశ, దిశా విధానం మొత్తము కూడా  ఒకే అంశం మీద ఆధార పడింది. అది “భారతీయం ప్రతిజ్ఞ”ను విద్యార్ధుల చేత, ప్రజల చేత, నాయకుల చేత మరియు సంస్థల చేత చేయించుట. ఆ తదుపరి వారు వారి ప్రతిజ్ఞను నిలబెట్టుకొనే మార్గాలవైపు పయనించేటట్లు ప్రేరేపించడం.

భారతీయం ఉద్యమాన్ని ముందుకు నడపడానికి ఎంతో మేధోమధనం జరిగింది. చివరికి కళల ద్వారానే మార్పు తీసుకురాగలం అని తీర్మానించడం జరిగింది. ఈ విధంగా కళార్చన మిషన్ ఉనికిలోకి వచ్చింది.

 

మొదటి అడుగులు :

‘భారతీయం’ కళార్చన మొట్టమొదటగా 18 జనవరి 2011న ఎన్టీఆర్ కళాపరిషత్, ఒంగోలు వేదికనందు అంకురార్పణ  జరిగింది. అప్పటికే ఎన్టీఆర్ కళాపరిషత్ 12వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని, ఆంధ్ర ప్రదేశ్ రంగస్థల పరిషత్తులలోనే ప్రప్రధమ స్థానంలో ఉన్నది. ఎన్టీఆర్ కళాపరిషత్ అప్పటికే నిర్వహిస్తున్న రంగస్థల కార్యక్రమాలతో పాటు జానపద కళారూపాలు, బాలోత్సవం, పుస్తక ప్రదర్శనలు, నైతిక విలువలకు పట్టాభిషేకం (శ్రీ భారతీయుడు అవార్డ్స్) మొదలగు అంశాలకు ‘భారతీయం’ కళార్చన శ్రీకారంచుట్టింది. ఈ కార్యక్రామాలు 8 రోజులపాటు నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో ప్రజా నాట్యమండలి, జన విజ్ఞాన వేదిక (రాజకీయ యేతర), వివిధ కళాశాలలు మరియు పాఠశాలలు భాగస్వాములయ్యాయి. కళార్చన మిషన్ తో పాటు భారతీయం ఉద్యమానికి సంబంధించిన కొన్ని ముఖ్య కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఒక కొత్త సంస్థ అవసరాన్ని గుర్తించడం జరిగింది. అందుకని ఏప్రిల్ 2011 లో వాల్యూస్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి రిజిస్టర్ చేయడం జరిగింది. కళార్చన మిషన్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటం కోసం ఎన్నో చర్చాగోష్ఠులను నిర్వహించడం జరిగింది. 25౦ మంది సుప్రసిద్ధ రంగస్థల కళాకారులతో నిర్వహించబడిన ఒక చర్చాగోష్ఠినందు కళార్చన మిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు విస్తరించవలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించటమైనది .

 

ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు విస్తరించడానికి చేసిన ప్రయత్నాలు:

2012 లో మొదటిసారిగా “కళార్చన జాతీయ ఉత్సవాన్ని” ఒంగోలులో నిర్వహించడం జరిగింది.  వాల్యూస్ ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ కళాపరిషత్ వారు ప్రముఖ భాగస్వాములుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఎఫర్ట్ , జన విజ్ఞాన వేదిక, వివిధ పాఠశాలలు, కళాశాలలు భాగస్వాములుగా పనిచేసారు. 2011న జరిగిన రంగస్థల, జానపద కళారూపాలు, పుస్తక ప్రదర్శనలు, నైతిక విలువల పట్టాభిషేకం తో పాటు గ్రౌండ్ ప్లేలు(నిజ దృశ్య రూపకాలు), చేతి వృత్తుల ప్రదర్శనలు, సుస్థిర వ్యవసాయ ప్రదర్శనలు, సామాజిక ధృక్పథ కార్యక్రమాలు, ప్రజా వేదికలు, పాఠశాల సాహిత్య కార్యక్రమాలను జోడించి రోజుకి 14 గంటల కార్యక్రమాలు చొప్పున 12 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. తద్వారా రోజుకి 1౦౦౦౦ మంది ప్రేక్షకులను మరియు కళాకారులను కళార్చనలో భాగస్వాములుగా చేయడం జరిగింది. 12 రోజులపాటు జరిగిన ప్రతి కార్యక్రమo ప్రజలను నవ స్వరాజ్య నిర్మాణం వైపు ప్రోత్సహించాయి.

ఖమ్మం, నంద్యాల, హైదరాబాదుకు సంబంధించిన కొన్ని కళాసంస్థలు వారి వారి ప్రాంతాల లో ‘భారతీయం’ కళార్చన ఉత్సవాలను 2012 లో నిర్వహించాయి.

 • ఆగష్టు 4-8, 2012 : ఖమ్మం కళాపరిషత్, వాల్యూస్ ఫౌండేషన్
 • సెప్టెంబర్ 5-9, 2012 : కళారాధన-నంద్యాల, వాల్యూస్ ఫౌండేషన్
 • అక్టోబర్ 27-3౦, 2012 : ఆంధ్ర నాటక కళా పరిషత్, శ్రీ సత్య సాయి కళానికేతన్, వాల్యూస్ ఫౌండేషన్, ఏపి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ.

కళార్చన ఉత్సవాలు అన్ని చోట్లా బాగా విజయవంతం అయినప్పటికీ కొన్ని సాoకేతిక లక్ష్యాలను అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తించడం జరిగింది. భవిష్యత్తులో వివిధ జిల్లాలకు కళార్చనను తీసుకువెళ్ళటానికి ఒక సంచార రంగస్థలం ఏర్పాటు చేయాల్సిన కొత్త అవసరం ఏర్పడింది.

విస్తృత ప్రచారానికి ఉపయోగపడే “థియేటర్ 36౦” ప్రయోగాలు  ( 2013 నుండి )

ఎరీనా కార్యక్రమాలు (గ్రౌండ్ ప్లేస్, జాన పదాలు , ౩D ప్లేస్) నిర్వహించేందుకు, రంగస్థల కార్యక్రమాలకు మెరుగైన టెక్నలాజికల్ సౌకర్యాలు ఉండే థియేటర్ ని తయారు చేయడం కోసం “థియేటర్ 36౦” అనే ఒక థియేటర్ని  2013 నుండి ‘భారతీయం’ కళార్చన కార్యక్రమాలలో ప్రయోగించడం జరుగుతుంది. అష్టభుజి(Octagonal) , షడ్భుజి(Hexagonal), చతురస్రము(Square) ఆకారాలలో స్టేజిలను ప్రయోగించడం జరిగింది. 2013 లో 16 రోజులు, 2014 లో 29 రోజులు, 2015 లో 21 రోజులు, 2016 లో 21 రోజులు , 2017 లో 26 రోజులు పాటు వివిధ కార్యక్రమాలను ప్రయోగాత్మకం గా థియేటర్ 360° పై ప్రయత్నించడం జరిగింది.

 

1.5. కళార్చన మిషన్ – భవిష్యత్ కార్యాచరణ :

2011 నుండి 7 సంవత్సరాలపాటు కళార్చన మిషన్ ఎన్నో ప్రయోగానుభవాలు చవిచూసింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కళార్చన మిషన్ విజయవంతమయ్యేందుకు వినూత్న మార్గాలను మనందరం కలసి అన్వేషించాల్సిన అవసరం ఉంది. కళార్చన మిషన్ ఇకముందు చేపట్టదలచిన లక్ష్యాలు ఈ క్రింద వ్రాయబడ్డాయి. మీ సలహాలు, సూచనలు ఇవ్వదలచుకుంటే 9848910111కు సంప్రదించమనవి.

 1. థియేటర్ 36౦/ సంచార థియేటర్ పూర్తి స్థాయిలో తయారు చేయుట.
  1. ఇండోర్ థియేటర్ : గాలి, వాన, ఎండను తట్టుకోగలిగినది
  2. అన్ని రకాల కార్యక్రమాలు (రంగస్థల కళలు ఎరినా కార్యక్రమాలు (గ్రౌండ్ ప్లేస్, జానపదాలు , ౩D ప్లేయ్స్…), వర్క్ షాపులు , సెమినారులు, కళాకారుల వసతి, ప్రదర్శనశాలలు) చేయడానికి కావలిసిన సౌకర్యాలు(కాలుష్యేతర సౌకర్యాలు).
  3. వినూత్న పద్ధతిలో సులభంగా తరలించగలిగిన థియేటర్
  4. ప్రజలను ఆలోచింపచేయగలిగిన మరియు జాతీయ సమైక్యతాభావాలు నింపగలిగిన అంశాలతో థియేటర్ అలంకరణ.
 2. థియేటర్ 36౦/ సంచార థియేటర్ వినియోగించుకొని ప్రతి జిల్లాలో నెలకి 21 రోజుల పాటు, సంవత్సరం పొడవునా “జాతీయ సమైక్యతాయాత్ర” చేయడం. ఆ తదుపరి వచ్చిన అనుభవంతో కొత్త సంచార థియేటర్లను తయారు చేసి “జాతీయ సమైక్యతా యాత్రను” మరిన్ని జిల్లాలకు తీసుకువెళ్ళడం.
 3. కేవలం కళాఉత్సవాలకే కాక థియేటర్ 36౦/ సంచార థియేటరును ఒక సంచార విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుట. కళార్చన మిషన్ యొక్క ఈ క్రింది కార్యక్రమాలకు ఈ విశ్వ విద్యాలయాన్ని వినియోగించుట
  1. 64+ కళల పత్రికీకరణ, సంరక్షణ మరియు అభివృద్ధి
  2. సంప్రదాయ కళల ఆధునీకరణ (మూలాలు చెడకుండ)
  3. భారతీయం ఉద్యమ సాధనకు కృషి చేయగలిగిన కళా సంస్థలమధ్య సమన్వయాన్ని కల్పించడం
 4. కళార్చన మిషన్ లక్ష్య సాధనకై ఒక శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయుట

 

Create your website at WordPress.com
Get started
%d bloggers like this: